Jagathguru Bhodalu Vol-9        Chapters        Last Page

భద్రాద్రిరామునికి భద్రగజము
శ్రీ వారణాసి రామమూర్తి (రేణు)

భద్రగిరి శ్రీ సీతారామాలయ గర్భగృహ విమాన, కల్యాణమంటపములు మహాసంప్రోక్షణ సందర్భంలో జగద్గురువులు కామకోటి పీఠాధివులు భద్రాచలం విజయం చేశారు. ప్రోక్షణకు ముందురోజే శ్రీవారు అపరాహ్ణం నాలుగు గంటలకు తమపరివారంతో విడిదినుంచి బయలుదేరి రామాలయం సందర్శించారు. ఆలయం ఆవరణలో భద్రాద్రిరామదాసు గుడిమెట్లపై ఆసీనులయ్యారు. పరివారంలోని ఒక యతి రామదాసు కీర్తనలు గానంచేస్తూవుంటే, కీర్తనలోని ఆంతర్యాన్ని భక్తులకు వివరిస్తూ రెండుగంటలకాలం గడిపారు. మధ్యలో శ్రీ రామాలయ ప్రధానార్చకులు అమరవాది రామానుజాచార్యులు పాతకాలపు వ్రాతపత్రాన్ని శ్రీవారికి చూపారు. అది తమ పూర్వీకులకు భద్రగిరి వరదరామదాసు మూడు తరాలక్రింద ఇచ్చిన అర్చకహుకుం. అపత్రం తెలుగులోఉంది.

సుమారు 150 ఏళ్ళక్రింద వ్రాయబడినందున చిల్లులుపడి శిధిలావస్థలో వున్నది. శ్రీవారు ఉత్సాహంతో అందులో ఏమివ్రాసి ఉన్నదో చదవమని ఆచార్యులను అడిగారు. ఆచార్యులు ఆ గొలుసుకట్టు లిపిని తాము చదవలేమన్నారు. అంతలో ఎదురుగా కూర్చున్న నన్ను స్వాములవారు చదవమని ఆదేశించారు. వ్రాత గొలుసుకట్టుగా వున్ననూ చదవాడానికి అంత కష్టమనిపించలేదు. ఒక పర్యాయం చదివి తర్వాత బిగ్గరగా చదవడం ప్రారంభించాను.

ఆ ఆజ్ఞాపత్రం 'శ్రీ భద్రాచలరామచంద్ర మహాప్రభువువారు' అనే అక్షరములుగల ముద్రతో అమరవాదిచంన్న కృష్ణమాచార్యులు అనే ప్రధాన అర్చకునకు భద్రగిరి వరదరామదాసుగారి దస్కతుతో జారీ చేయబడింది. అందులో స్వామివారికి ప్రతిదినమూ అర్పించవలసిన సేవల క్రమమూ, విశేషదినములలో జరుపవలసిన ఉత్సవములూ సేవలూ వివరించబడినవి. ప్రబోధసేవ మొదలు పర్యంకసేవ వరకూ పదిసేవలున్నవి. ఈ వివరములువిన్న పిదప స్వాములవారు ఇవన్నీ యథాతథంగా ఇపుడు జరుగుచున్నవా అని ప్రశ్నించారు. ఆచార్యులవారు మొత్తానికి సేవలు జరుగుచున్నవి కానీ పత్రంలో ఆదేశించినట్లు జరగటం లేదన్నారు.

శ్రీవారు :- ప్రబోధసేవలో ఒక ఏనుగు, ఒక పెద్ద గుర్రము కోవెలవద్ద ఉండవలసినదని ఉన్నది. ఈనాడు ఆ రెండూ లేవుకదా! ఒక ఏనుగును ఆలయానికి ఎందుకు కొనరాదు?

అర్చకుడు:- భరించుట కష్టంకదా. ఈ కొండప్రదేశంలో దానికి పచ్చిగడ్డి కూడా దొరకదు.

శ్రీవారు :- పోనీ. గోదావరిలో నీళ్ళున్నాయికదా!

అర్చకుడు:- (తికమకపడుతూ) చిత్తం చిత్తం

శ్రీవారు :- ఆలయాధికారులు కనీసం ఒక ఏనుగునైనా పోషించడం అవసరం. ఆ మహానుభావుడు రామదాసుగారి దినాలనుంచీ వస్తూ మధ్యలో మరుగు పడ్డ ఆచారాన్ని పునరుద్ధరించాలి. భద్రగిరి ప్రభువుకు భద్రగజం లేకపోవడం ఒక లోపం కదా!

అంటూ శ్రీవారు నావైపుచూచి ఆ ఆజ్ఞాపత్రపు ప్రతి ఒకటి తయారుచేసి ఇమ్మాన్నారు.

తర్వాత బాలభోగంలో స్వామివారి నైవేద్యం చేయవలసిన వస్తువుల చర్చవచ్చింది. వానిలో 'యర్రతయిరుప్రసాదం' అని వుంది. దానిని వివరిస్తూ శ్రీవారు ఆవుపాలను మరుగకాస్తే కొద్దిపాటి ఎర్రరంగు వస్తుంది. అందులో రామదాసు తమ ఇష్టదైవమైన రాముడికి రుచిగా ఉండాలని బహుశా కుంకుమపువ్వుకూడా వేసి, పేరపెట్టి అమధురమైన పెరుగుతో దధ్యోదనం చేయించేవారేమో అని అన్నారు. బాలభోగవిషయంలో ఆభక్తుని ఆసక్తినిచూచి మాహృదయాలు ఆర్ద్రమైనవి. ఈ విషయం వివరించేటపుడు శ్రీవారి ముఖమండలం దివ్యతేజంతోనూ, ఆనందంతోనూ కళకళలాడింది.

తర్వాత తిరువీసందోసెల ఉదంతం వచ్చింది.

శ్రీవారు :- తిరువీసం అంటే ఏమి?

నేను :- నాకు తెలియదు. శ్రీ అన్నమాచార్యులవారు తమ పదాలలో వాడారు. 'తిరువీసమారగించి ప్రొద్దుపోయె పవ్వళింపు భోగాల రాయా' అని ఏకాంతసేవలో పాడారు. బహుశ ఇది తమిళపదమేమో ఒక ప్రత్యేకమయిన ప్రసాదం కావచ్చు. శ్రీవారు సెలవియ్యాలి.

శ్రీవారు :- తిరు అంటే - శ్రీ - పవిత్రమైనది అని అర్థం. వీసం అంటే రూపాయిలో పదహారవవంతు. ఇక్కడ తిరువీసం అంటే ఏదోకొంత ప్రమాణం పెట్టుకొని అందులో పరహారవవంతు దోసెలుగా చేయమని ఉండేదేమో.

తర్వాత ప్రభుత్వసేవలో 'వెండికలందాసు' (కలంపెట్టుకునే పెట్టెలాంటిది)- బంగారుకలం, సిరాబుడ్డి, సునేరికాగితం బంగారు మొహరు, చక్కనూ పీటమీద సన్నిధిలో ఉంచమని ఉంది.

శ్రీవారు :- కలందానా? సునేదికాగిదమా? అంటే?

నేను :- కలంపెట్టుకొనే స్టాండు కలందాను. సునేరి అంటే బంగారపు - సున్‌హరీ - హిందీమాట. అంటే బంగారు రంగుకల కాగితం. బంగారు రజను పైన చల్లబడ్డ కాగితం.

శ్రీవారు :- బాగావుంది. స్వామివారి హోదాకు తగినట్టే వున్నది. మరి సకలలోకాలకూ అధికారి నాయకుడాయెను శ్రీరాముడు. అర్చకునివైపు తిరిగి ఇవి ఇప్పుడున్నాయా?

ఆచార్యలు గారు ఏమీ మాట్లాడలేదు.

''తెల్ల వస్త్రములు కనుమాసినవి ధరియింపవద్దు. స్వామివారికి కట్టిన బట్టలు తిరిగి స్వామివారికి ధరింపవద్దు. జాగ్రత్త.''

ఈ వాక్యంవిని శ్రీవారు 'ఇది మంచి ఆదేశం. అంటే స్వామి వారికి ఏరోజుకారోజు క్రొత్తబట్టలు తెల్లగా ఉండేవే ధరింపచేయాలన్న మాట. ఎన్నో ఏండ్ల క్రిందట, ఎంతోభక్తి శ్రద్ధలతో స్వామి కైంకర్యానికి చేసిన ఈ కట్టుబాట్లన్నీ ఎప్పుడూ జరుగుతూ వుండాలి. నిజానికి ఇవి ఏమంత కష్టమైన నిబంధనలుకావు. ఈనాడు మన అధికారులు శ్రద్ధపడితే ఆ మహాభక్తుడు వరదరామదాసు పెట్టిన వరవడి ప్రకారం జరిగించవచ్చును. ఇంతప్రాచీనమై మహాత్మ్యంగల మహాక్షేత్రంలో ఆలయ పునరుద్ధరణతో బాటు ఈ సేవలూ పునరుద్ధరింపబడుట అవసరం. నీవు ఈ పత్రిక ప్రతి తయారుచేసి రేపు ఇవ్వు'' అని అన్నారు. శ్రీవారి ఆదేశానుసారం ఆచార్లగారివద్దనుంచి ఆ పత్రం తీసుకొని ఆ రాత్రే దానికి నకలు తీసి మర్నాడు ఉదయం ఎనిమిది గంటలకు శ్రీవారికి సమర్పించాను. ఆ సమయమున అక్కడ దేవాదాయశాఖ కమీషను శ్రీ వాసుదేవరావుగారు కూడ ఉన్నారు. శ్రీ స్వాములవారు ఆప్రతిని కమీషనరుగారికిఇచ్చి ఇందులో స్వామివారికి జరిపించవలసిన సేవల వివరాలన్నీ ఉన్నవి. ఇవి ఏనాడో రామదాసుగారు ఏర్పరిచిన మరియాదలు. ఇవి మీరు మళ్ళీ సక్రమంగా జరిపించడం అవసరం. దేవాలయానికి కనీసం ఒక ఏనుగును సంపాదించి కోవెల ఆవరణలో ఉండేవిధంగా చేయండని కోరారు. కమీషనరుగారు అలాగే చేస్తామని ఆ పత్రం తీసుకొన్నారు.

( 9 - 22 )


Jagathguru Bhodalu Vol-9        Chapters        Last Page